కార్టోశాట్-2ఇ సహా నింగిలోకి 31 ఉపగ్రహాలు
శ్రీహరికోట (రవికిరణాలు 22-06-2017): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం-షార్ నుంచి శుక్రవారం ఉదయం 9.29 గంటలకు పోలార్ ఉపగ్రహ వాహకనౌక (పీఎస్ఎల్వీ)- సీ38ను నింగిలోకి ప్రయోగించనున్నారు. ఈ వాహకనౌక కార్టోశాట్-2ఇ ఉపగ్రహాన్ని, తమిళనాడులోని నూరుల్ ఇస్లాం విశ్వవిద్యాలయం విద్యార్థులు రూపొందించిన ఉపగ్రహంతోపాటు ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ సహా 14 దేశాలకు చెందిన 31 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. రాకెట్ ప్రయోగానికి ముందుగా నిర్వహించే కౌంట్డౌన్ ప్రక్రియ గురువారం ఉదయం 5.29 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది నిరంతరాయంగా 28 గంటలపాటు కొనసాగిన అనంతరం పీఎస్ఎల్వీ నింగిలోకి దూసుకెళ్లనుంది. బుధవారం ఉదయం ప్రయోగానికి రిహార్సల్ నిర్వహించారు. షార్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాకెట్ సన్నద్ధత సమావేశం (ఎంఆర్ఆర్) జరిగింది. అనంతరం లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్) సమావేశం నిర్వహించారు.
పెరగనున్న భూపరిశీలన సామర్థ్యం
కార్టోశాట్-2ఇ ఉపగ్రహంతో భూ పరిశీలన సామర్థ్యం పెరుగుతుంది. దీని బరువు 712 కిలోలు. మిగిలిన 30 నానో ఉపగ్రహాల బరువు 243 కిలోలు.
పీఎస్ఎల్వీ వీటిని 505 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి ధ్రువ సూర్య అనువర్తిత కక్ష్యలో ప్రవేశపెడుతుంది.
ప్రాజెక్టు వ్యయం రూ.160 కోట్లు.
గతేడాది జూన్ 24న, ఈ ఏడాది ఫిబ్రవరి 15న రెండో కార్టోశాట్ ఉపగ్రహాలను ఇస్రో కక్ష్యలో ప్రవేశ పెట్టింది. ప్రస్తుతం ఇవి సేవలు అందిస్తున్నాయి.
No comments: