నెల్లూరు, డిసెంబర్ 19, (రవికిరణాలు) : జిల్లాలోని 80 శాతం మంది నిరుద్యోగ యువతకు నైపుణ్యాలు అభివృద్ధి, ఉపాధి కల్పన కై 4 రోజుల్లోగా జిల్లా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని జిల్లా కలెక్టరు ఎమ్.వి.శేషగిరిబాబు అధికారులను ఆదేశించారు.గురువారం మధ్యాహ్నం జిల్లా కలెక్టరు కలెక్టరేట్‌లోని వారి ఛాంబర్లో రెండవ సంయుక్త కలెక్టరు కె.కమలకుమారితో కలసి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పలు పరిశ్రమల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలతో సమావేశం నిర్వహించి సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు నైపుణ్యాలు అభివృద్ధి పరచి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తోందన్నారు. ఇందులో భాగంగా ఒక సాఫ్ట్ వేర్ వేదిక సృష్టించాలన్నారు. ఇందుకోసం పరిశ్రమలు కోరుకునే నైపుణ్యాలను గుర్తించి వాటికి అవసరమైన డేటాబేస్ వివరాలతో జిల్లా కార్యాచరణ ప్రణాళిక వచ్చే 4 రోజుల్లో తయారు చేసి అందజేయాలన్నారు. ఇందులో శాఖలవారీగా, విభాగాలవారీగా శిక్షణలు, ఎక్స్పోజర్ విజిట్లు, ఇంటర్న్ షిన్లు, మ్యాట్రిక్స్ ప్రణాళిక పొందుపరచాలన్నారు. జిల్లాలో కనీసం 80 శాతం మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలన్నారు. సరైన శిక్షణనిస్తే ఉపాధి దొరుకుతుందనే ధీమా కలగాలని ఆ రకంగా వ్యూహాత్మక పత్రం సిద్ధం చేయాలన్నారు. చదువుతున్న వారికి, చదివిన వారికి వేరు వేరుగా ఏమేమి నైపుణ్యాలు అవసరమో అందులో శిక్షణనివ్వలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, అందులో చదువుతున్న విద్యార్థుల వివరాలు అందజేయాలన్నారు. ఇకపై దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని 2 రోజులకు ఒకసారి సమావేశం నిర్వహించి సమీక్షిస్తామన్నారు.ఈ సమావేశంలో డి.ఆర్.డి.ఎ. పి.డి. శీనా నాయక్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ మారుతి ప్రసాద్, ఎ.పి.ఐ.ఐ.సి. జోనల్ మేనేజరు నిర్మల, జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేష్ కుమార్,జిల్లా వృత్తి విద్యాధికారి శేషయ్య, శ్రీసిటీ వైస్ చైర్మన్ రమేష్ కుమార్, పరిశ్రమలు, విద్యా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
No comments: