ఈనెల 16 నుండి 30 వరకు రైతును చైతన్యపరిచే ప్రత్యేక కార్యక్రమం - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

ఈనెల 16 నుండి 30 వరకు రైతును చైతన్యపరిచే ప్రత్యేక కార్యక్రమం

నెల్లూరు, డిసెంబర్‌ 13, (రవికిరణాలు) : ఈ నెల 16 నుండి 30వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా మంచి పంట దిగుబడులు సాధించేందుకు ప్రతి రైతును చైతన్యపరిచే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు జిల్లా కలెక్టరు ఎమ్.వి.శేషగిరిబాబు వెల్లడించారు.శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టరు నగరంలోని వ్యవసాయ పరిశోధనా స్థానంలో గల సమావేశ మందిరంలో వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు ఆనంద కుమారితో కలసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ గురువారం విడవలూరు మండల పర్యటనలో రైతు గునుపూడి శివప్రసాద్ తో మాట్లాడినపుడు కొన్ని ఆసక్తికర విషయాలు తెలిసాయన్నారు. జిల్లాలో ఈ రబీ సీజన్ లో 6 నుండి 7 లక్షల ఎకరాల్లో వరి పైర్లు సాగవుతున్నాయని, రైతులు సరైన జాగ్రత్తలు పాటించి ఖర్చు తగ్గించుకుని, అధిక దిగుబడులు సాధించాల్సిన అవసరం వుందన్నారు. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయశాఖ పంటపొలాల నమూనాలు సేకరించి భూసార పరీక్షలు నిర్వహించి విశ్లేషించి భూసార కార్డులను రైతులకు యిచ్చిందన్నారు. ఏ భూమిలో ఎంతశాతం నత్రజని, భాస్వరము తదితర పోషకాలున్నాయో అందులో వివరించండం జరుగుతుందన్నారు. అయితే రైతులు సాధారణంగా అవసరం లేకున్నా మోతాదుకు మించి అధికంగా యూరియాను వినియోగిస్తున్నారన్నారు. దీంతో రైతుకు ఖర్చు పెరగడంతో పాటు, పొలానికి, పంటకు నష్టం వాటిల్లే ప్రమాదం వుందన్నారు. ఇటువంటి అనవసర ఖర్చులు తగ్గించి, చీడ పీడలు నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు తద్వారా మంచి దిగుబడులు పెంచుకోవడానికి ఒక బృహత్తర కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 16వ తేదీ నుండి 30వ తేదీ వరకు ప్రతి మండలంలోని ప్రతి రైతును వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు కలిసి వారి వ్యవసాయ పద్ధతులను పరిశీలించి రైతులకు ఖర్చు భారం లేకుండా, మేలు జరిగే విధంగా సూచనలు, సలహాలందించి చైతన్య పరుస్తారన్నారు. అంతేగాకుండా వచ్చే నాలు గైదు రోజుల్లో క్రిమిసంహారక మందుల దుకాణాల యజమానులతో సమావేశం నిర్వహించి రైతుల పైన భారం పడకుండా నాణ్యమైన మందులు యిచ్చే ఏర్పాటు చేస్తామన్నారు. నాణ్యత లోపించిన మందులు లేకుండా యిదివరకే వ్యవసాయ అధి కారులు చర్యలు తీసుకున్నారన్నారు. ఇంకా పెద్ద ఎత్తున తనిఖీలు చేపడతామన్నారు. అలాగే కృషి విజ్ఞాన కేంద్రంలో టోల్ ఫ్రీ నెంబరు 18004253141తో ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని శాస్త్రవేత్తలు రెండు షిప్టుల్లో పనిచేస్తారని, రైతులకు వచ్చే ఫిబ్రవరి మాసాంతం వరకు వ్యవసాయ సంబంధ సలహాలు, సూచనలు యివ్వడంతో పాటు అవసరమైతే ఆ ప్రాంతం పరిశీలించి స్థితిగతులు తెల్పుతారన్నారు. పత్రహరిత ఆకు చిత్ర పటాన్ని విశ్లేసిస్తూ ప్రతి గ్రామంలోని గ్రామ చావిడి, సచివాలయాల్లో రైతులకు అవగాహన కోసం ప్రదర్శిస్తారన్నారు. పచ్చిరొట్ట ఎరువులను ప్రోత్సహిస్తూ సాగులో మార్పులు చేసుకొనే విధంగా కృషి చేస్తున్నామన్నారు. రసాయనక ఎరువుల వలన భూమిసారం తగ్గిపోతుందన్నారు. వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు ఆనంద కుమారి మాట్లాడుతూ జిల్లాలో 3.6 లక్షల హెక్టార్ల సాగు విస్తీర్ణము కలదని, ప్రస్తుతము రబీ సీజన్ లో పంటల సాగు వివరములు సాధారణ సాగు విస్తీర్ణము 2,39,572 హెక్టార్లు వుండగా ఇప్పటి వరకు 1,34,317 హెక్టార్ల విస్తీర్ణములో సాగు అయినదన్నారు. జనవరి రెండవ వారములోపు ఇంకను 1.25 లక్షల హెక్టార్ల విస్తీర్ణములో వరిపైరు సాగవుతుందని అంచనా వేశామన్నారు. నేల స్వభావము భూమిలో ఇసుక, బంకమట్టి, ఒండ్రు శాతమును బట్టి వుంటుందన్నారు. జిల్లాలో 9 లక్షల భూసార పరీక్షల ఆరోగ్య కార్డులను రైతులకు యివ్వడం జరిగిందన్నారు. భూసార పరీక్షా ఫలితాల ఆధారముగా జిల్లాలోని నేలల్లో సేంద్రియ కర్బనము తక్కువ నుండి మధ్యస్థముగా వుందన్నారు. లభ్య నత్రజని లభ్య పొటాష్ స్థాయి తక్కువగాను, లభ్య భాస్వరము స్థాయి ఎక్కువగా వున్నదన్నారు. సేంద్రియ కర్బనము స్థాయిని పెంపొందించుటకు కంపోస్టు ఎరువులు, పచ్చిరొట్ట పైర్లు సాగు చేయవలసి వుందన్నారు. తద్వారా లభ్య నత్రజని స్థాయిని వృద్ధి చేసుకోవచ్చన్నారు. 2010-20 సంవత్సరములో 22600 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు 75 శాతము రాయితీ పై రైతులకు అందించామన్నారు. నత్రజనికి సులభంగా కొట్టుకొనిపోయే స్వభావము కలదని, వేసిన ఎరువులో 60 - 65 శాతము వృధా అగునని, సిఫారసు చేసిన నత్రజని ఎరువును (యూరియా) 3 - 4 దఫాలుగా వేసుకోవాలన్నారు. డి.ఎ.పి. ఎరువు వాడుట వలన వేరు వ్యవస్థ వృద్ధి చెందుటకు రైతులు అధికముగా పైపాటుగా చేసే అలవాటు వున్నదన్నారు. అధిక మోతాదులో వాడుట వలన జింక్ లోపము లక్షణాలు కనబడి 10 - 12 శాతము దిగుబడి తగ్గుతాయన్నారు. పొటాష్ ఎరువు రోగనిరోధకశక్తి పెంచుతుందన్నారు. యూరియాను సిఫారసు చేసిన మోతాదులో 3 - 4 సార్లు పైరులో వేయాలని, డి.ఎ.పి.ని దుక్కిలోను, పొటాష్ ఎరువును 2 దఫాలుగా వేసుకోవాలన్నారు. జిల్లాలో సూక్ష్మ పోషకాలు 74 శాతము జింకు, 40 శాతము జనుము 30 శాతము మాంగనీసు, 38 శాతము జో రాన్ లోపము గుర్తించామన్నారు. జింకు, పోషక లోపములను సవరించుటకు వ్యవసాయశాఖ ద్వారా 70 శాతము సబ్సిడీపై రైతులకు జింకు సల్ఫేట్, బోరాక్స్ అందించబడుచున్నదన్నారు. కేవలము రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడినంత మాత్రమున దిగుబడి పెరగదని, పురుగులు నిర్మూలన కావు, భూసార పరీక్షల ఆధారముగా పంటలకు సిఫారసు చేసిన ఎరువుల మోతాదులు వాడినట్లైతే నేల ఉత్పాదకత శక్తి పెరిగి నేల ఆరోగ్యము దెబ్బతినకుండా వుంటుందన్నారు. నేల యాజమాన్య పథకమును 1700 హెక్టార్లలో అన్ని మండలములలో ఒక గ్రామమును ఎంపిక చేసి నిర్వహించబడుచున్నదన్నారు. ఎంపిక చేసినగ్రామములలో 12,712 మట్టి నమునాలు సేకరించి పరీక్షలు నిర్వహించబడినవన్నారు. పోషక లోపముల సవరణకు రూ.2,500లు విలువగల పోషకాలు రాయితీ పై సరఫరా చేశామన్నారు. రైతు సోదరులు మోతాదుకు మించి రసాయనిక ఎరువులు వేయకుండా భూసార పరీక్ష ఫలితాల ఆధారముగా ఎరువులు వాడాలని కోరారు.కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త శ్రీమతి లలిత శివజ్యోతి మాట్లాడుతూ రసాయన ఎరువుల వాడకం మోతాదు తగ్గించుకొని సేంద్రియ ఎరువులను రెండింట మూడొంతులుగా ప్రోత్సహిస్తున్నామన్నారు. అజొల్లా వంటి సజీవ జీవన ఎరువులను వినియోగిస్తే 11 శాతం నత్రజిని ఆదా అవుతుందన్నారు. తమ కేంద్రంలో రైతులకు సలహాలు, సూచనలు యిచ్చేందుకోసం టోల్ ఫ్రీ నెం.18004253141 కు ఎప్పుడైనా సంప్రదించవచ్చని, ప్రతి సోమవారం, శనివారం అయితే 18004255979 లో సంప్రదించాలన్నారు.ఓరియంటల్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ మేనేజర్ ఎం. నరసింహులు మాట్లాడుతూ ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో 1,00,793 మంది రైతులు ప్రధానమంత్రి పంటల భీమా పథకంలో నమోదైనారని, వారికి సంబంధించి 48 కోట్ల రూపాయల మేరకు క్లెములు పరిష్కారానికి ప్రభుత్వం నుండి వుత్తర్వులు అందాల్సి వుందన్నారు.అధిక ఎరువుల వినియోగం పై వచ్చే అనర్థాలు అనే అంశంపై ఆత్మ రూపొందించిన గోడ పత్రికను జిల్లా కలెక్టరు ఆవిష్కరించారు.ఈ పాత్రికేయుల సమావేశంలో రైతు శిక్షణా కేంద్రం డి.డి. శివనారాయణ, వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త వినీత, మరో శాస్త్రవేత్త సురేఖదేవి, వ్యవసాయశాఖ ఎ.డి.అనిత, ఎల్.డి.ఎం. రాంప్రసాద్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.
ఈనెల 16 నుండి 30 వరకు రైతును చైతన్యపరిచే ప్రత్యేక కార్యక్రమం Reviewed by CHANDRA BABU on December 13, 2019 Rating: 5 నెల్లూరు, డిసెంబర్‌ 13, (రవికిరణాలు) : ఈ నెల 16 నుండి 30వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా మంచి పంట దిగుబడులు సాధించేందుకు ప్రతి రైతును చైతన్యపర...

No comments: