ఎస్పీ గారూ మీ మార్క్‌ ఏది...? - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

ఎస్పీ గారూ మీ మార్క్‌ ఏది...?

రవికిరణాలు(బ్యూరో): పీహెచ్‌డీ రామకృష్ణ.... గ్రూప్‌ 1 పరీక్ష రాసి.. సివిల్‌ సర్వీసెస్‌లో ప్రవేశించి... డీఎస్పీ స్థాయి నుంచి ఎస్పీ స్థాయికి ఎదిగిన అధికారి. పీహెచ్‌డీ రామకృష్ణ అనగనే చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్‌పై కన్నెర్ర చేసిన సూపర్‌ పోలీస్‌ గుర్తొస్తారు. అలాగే విచ్చలవిడిగా ఉన్న కడప ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించిన స్ట్రిక్ట్‌ ఎస్పీ జ్ఞప్తికొస్తారు. అలాంటి ఎస్పీ నెల్లూరుకు వస్తున్నారనగానే ఎర్రచందనం స్మగర్లు, ఇసుక మాఫియా, ఇతర నేరగాళ్ల గుండెల్లో గుబులు పుట్టింది. ఆయన జిల్లా ఎస్పీగా ఛార్జి తీసుకుంటున్నారనగానే... ఆయన గురించి తెలిసిన వాళ్లు లా అండ్‌ ఆర్డర్‌ విషయంలో జిల్లా మారబోతోంది అనుకున్నారు. కానీ ప్రస్తుతానికి జిల్లాలో పీహెచ్‌డీ రామకృష్ణ మార్క్‌ ఎక్కడా కనిపించలేదు.

నెల్లూరు ఎస్పీగా పీహెచ్‌డీ రామకృష్ణ బాధ్యతులు స్వీకరించి పక్షం రోజులు గడిచిపోయాయి. జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రోజు ఆయన చేయబోయే పనుల గురించి స్పష్టంగా వెల్లడించారు. ఇసుక, భూ, ఎర్రచందనం మాఫీయా గ్యాంగులకు గట్టిగా వార్నింగ్‌ కూడా ఇచ్చారు. జిల్లా ప్రజలకు పోలీసులతో స్నేహభావం ఏర్పడేలా చేస్తామన్నారు. ట్రాఫిక్‌ కష్టాలను కొలిక్కితెచ్చి... రోడ్డు ప్రమాదాలు తగ్గిస్తామన్నారు. అంతకుముందు జిల్లాల్లో రామకృష్ణ పనిచేసిన తీరు.... ఆయన సాధించిన రికార్డులను బట్టి జిల్లా ప్రజలు ఆయన మీద చాలా ఆశలు పెట్టుకున్నారు.

పదవిలోకి వచ్చిన రెండు వారాల్లోనే ఏం చేయాలి ? అని కొందరు అనుకోవచ్చు. కానీ పీహెచ్‌డీ రామకృష్ణ ఎస్పీగా ఏ జిల్లాలోనూ ఏళ్ల తరబడి పని చేయలేదు. తరచూ బదిలీలు అవతూనే ఉన్నారు. అయినా పనిచేసిన ప్రతీ చోట దటీస్‌ రామకృష్ణ అనిపించుకున్నారు. చెప్పాలంటే కడపలో మాత్రం ఆయన ఏడాది కాలం ఉన్నారు. 2013లో ఎస్పీగా చిత్తూరు వెళ్లిన పీహెచ్‌డీ రామకృష్ణ అక్కడ 8నెలలు మాత్రమే పనిచేశారు. కానీ ఎర్రచందనం స్మగర్లను ఓ పట్టు పట్టారు. శేషాచలం అడవులను అడ్డాగా చేసుకుని అక్రమ దందా నడుపుతున్న వారి భరతం పట్టారు. ఆ తర్వాత గుంటూరు రూరల్‌ ఎస్పీగా వెళ్లారు. అక్కడ కూడా పల్నాడు వంటి ప్రాంతాల్లో లా అండ్‌ ఆర్డ్‌ర్‌ను కంట్రోల్‌ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అక్కడ కూడా 8నెలలే పనిచేశారు. ఆ తర్వాత 2015 మార్చ్‌లో ఇంటలిజెన్స్‌ ఎస్పీగా బదిలీ అయ్యారు. మళ్లీ జిల్లా ఎస్పీగా 2016 మేలో కడపకు చేరుకున్నారు. పూర్వానుభవంతో ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు కృషి చేశారు. కడపలో ట్రాఫిక్‌ సమస్య మామూలుగా ఉండదు. అలాంటిది సరికొత్త పాలసీ తీసుకొచ్చి ప్రజల సహకారంతో ట్రాఫిక్‌ ఇబ్బందులను అధిగమించారు. ఎస్పీ కాక ముందు డీఎస్పీగా, ఎఎస్పీగా సేవలందించిన పీహెచ్‌డీ రామకృష్ణ 2009లో కఠిన సేవా పతకం, 2011లో శౌర్య పతకం అందుకున్నారు. ఇలాంటి ట్రాక్‌ రికార్డ్‌ ఉన్న ఎస్పీ మన జిల్లాకు వస్తున్నారంటే ప్రజల్లో ఆలోచన తారా స్థాయిలో ఉండడంతో తప్పులేదుగా. పనిచేసిన తక్కువ సమయంలోనే తనేంటో నిరూపించుకున్న పీహెచ్‌డీ రామకృష్ణ నెల్లూరులో మాత్రం ఎందుకో తన స్పీడ్‌ తగ్గించారు.

పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు ప్రకటించిన విధుల్లో ఒక్కటి కూడా పట్టాలెక్కలేదు అనిపిస్తుంది. ఇసుక మాఫియా అంతు చూస్తా అన్నారు. కానీ ఇంకా విచ్చలవిడిగా ఇసుక తరలిపోతూనే ఉంది. నెల్లూరుకు పెద్ద సమస్య ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా ట్రాఫికే. లక్షల సంఖ్యలో ఆటోలు రహదారులను కమ్మేస్తూ.. కాలుష్యాన్ని కుమ్మరిస్తున్నాయి. అలాంటి ట్రాఫిక్ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. ఇక మరో వాగ్దానం...ఎర్రచందనం దొంగ ఆటకట్టిస్తా అన్నారు....స్మగర్లకు హెచ్చరికలు సైతం జారీ చేశారు. అయినా అడవుల్లో మాటు వేసిన దొంగలు ఎర్రబంగారాన్నీ తరలిస్తూనే ఉన్నారు. దానికి తాజా ఉదాహణ ఈ రోజు పట్టుబడిన 240కేజీల ఎర్రచందనం దుంగలు. వెంకటగిరి నాయుడుపేట రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు... ఎర్రచందనం దుంగలతో పాటు అక్రమంగా తరలిస్తున్న దొంగలను అదుపులోకి తీసుకున్నారు. దీన్ని బట్టి చూస్తే ఎర్రచందనం అక్రమరావాణాని నిలువరించే ప్రక్రియ మొదలైంది అనుకోవాలో... లేక యథాప్రకారం పోలీసులు పట్టుకున్నారు అనుకోవాలో తెలియదు.

జిల్లాకు పెద్ద ముప్పుగా తయారైన ఇసుక మాఫియా గురించి రాష్ట్రమంతా తెలుసు. తెలుగుదేశం నాయకులు ఇసుకు మాఫియాలో ఉన్నారని స్వయానా ముఖ్యమంత్రే వారిని తన పార్టీ నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్న విషయం కూడా తెలిసిందే. మరి అంత పెద్ద సమస్యను పరిష్కరించడానికి ఎస్పీ ఏం కార్యచరణ రూపొందించారు..? దాన్ని అమలు చేయడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారు...? ఇసుక అక్రమ దందాకు పాల్పడుతున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు....?. బాడా బాబుల హస్తం ఉన్నందున ఆచితూచి అడుగు వేద్దామనుకుంటున్నారా...?లేక నిదానంగా సమస్యలు పరిష్కరిద్దామనుకుంటున్నారా...? ఏది ఏమైనా ఆయన మళ్లీ బదిలీ అయ్యేలోపు ఈ జిల్లాలో ఉన్న మాఫియాల బెడద వదిలిపోవాలి అనేది ప్రజల కోరిక. మరి దాన్ని నెరవేర్చేందుకు ఎస్పీ గారు ఎప్పుడు కదం తొక్కుతారో వేచి చూడాల్సిందే. ఆయన మార్క్‌ పడడం కోసం కోరుకోవాల్సిందే.

పనిచేసిన ప్రతి చోటా దూకుడుగా ఉన్న పీహెచ్‌డీ రామకృష్ణ ఇప్పడెందుకు నిదానంగా ఉన్నారు. వరుస బదిలీల ప్రభావం ఆయన పైన పడిందా లేక రాజకీయ ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతున్నాయా...?. లేక కార్యచరణ సిద్ధం చేసుకోవడంలో జాప్యం జరుగుతందా...?

 

 
ఎస్పీ గారూ మీ మార్క్‌ ఏది...? Reviewed by CHANDRA BABU on July 11, 2017 Rating: 5 రవికిరణాలు(బ్యూరో): పీహెచ్‌డీ రామకృష్ణ.... గ్రూప్‌ 1 పరీక్ష రాసి.. సివిల్‌ సర్వీసెస్‌లో ప్రవేశించి... డీఎస్పీ స్థాయి నుంచి ఎస్పీ స్థాయికి ఎద...

No comments: