రవికిరణాలు(తిరుమల - సెల్వం) : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 16వ తేదీన సాలకట్ల ఆణివార ఆస్థానాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని టిటిడి నిర్వహించింది. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మూత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అందులో భాగంగా ఈ రోజు ఉదయం 6 నుండి ఉదయం 11 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ తిరుమంజన ఉత్సవాన్ని పురస్కరించుకొని అష్టదళ పాదపద్మారాధన సేవను టిటిడి రద్దు చేసింది. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రంగా శుద్ధిచేశారు. ఆ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేసారు. శుద్ధి పూర్తి అయిన అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేసారు.అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు. అనంతరం భక్తులను మధ్యాహ్నం 12.00 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతించారు.
[gallery td_select_gallery_slide="slide" ids="940,939,938,937,936,935,934,933,932"]
[gallery td_select_gallery_slide="slide" ids="940,939,938,937,936,935,934,933,932"]
No comments: