రవికిరణాలు(తిరుమల-సెల్వం): తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట అపహరణకు గురైన చంటిబిడ్డకు సంబంధించిన కేసును 15 రోజుల వ్యవధిలోనే ఛేదించిన పోలీసు అధికారులను ఆదివారం టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, తిరుమల జెఈవో కె.ఎస్.శ్రీనివాసరాజు అభినందించారు. ఈ మేరకు రాయలసీమ ఐజి ఎన్.శ్రీధర్, డిఎస్‌పి మునిరామయ్య, సిఐలు వెంకటరవి, రామకృష్ణ, ఎస్‌ఐ తిమ్మయ్య ఇతర పోలీసు సిబ్బందికి తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట శ్రీవారి ప్రసాదాలు అందించారు. జూన్ 14వ తేదీన శ్రీవారి ఆలయం ఎదుట చెన్నకేశవ అనే చంటిబిడ్డ అపహరణకు గురయ్యాడని, పోలీసు అధికారులు బాగా కష్టపడి జూన్ 29న చంటిబిడ్డను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారని ఈవో తెలిపారు. ఇందుకోసం తిరుమల జెఈవో కె.ఎస్.శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో టిటిడిలోని ఐటి విభాగం, విజిలెన్స్ ఇతర విభాగాల అధికారులు చక్కటి సహకారం అందించినట్లు వెల్లడించారు. భక్తులకు మరింత భద్రత కల్పించేందుకు వీలుగా శ్రీవారి ఆలయం, మాడ వీధుల్లో ఉన్న సిసి కెమెరాల స్థానంలో ఆధునిక సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. టిటిడి విజిలెన్స్, పోలీసు అధికారులు మరింత అప్రమత్తంగా ఉండి తిరుమలలో భక్తులకు భద్రత పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. భక్తుల భద్రతా ఏర్పాట్ల కోసం పోలీసులకు టిటిడి తరఫున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ఈవో స్పష్టం చేశారు. అనంతరం డీఎస్పీ మునిరామయ్య ఆధ్వర్యంలో పోలీసు అధికారులు తిరుమలలోని ఈవో క్యాంపు కార్యాలయానికి చేరుకుని టిటిడి తరఫున సహాయ సహకారాలు అందించినందుకు ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జెఈవో కె.ఎస్.శ్రీనివాసరాజుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఈవో, జెఈవోలకు శ్రీవారి చిత్రపటం, శాలువతో పోలీసులను ఘనంగా సన్మానించారు. టిటిడి ఉన్నతాధికారులు సకాలంలో స్పందించి 20 వేల కరపత్రాలు, 10 వేల గోడపత్రికలు ముద్రించి అందించారని, సిసిటివి ఫుటేజిలతో పాటు అవసరమైన సిబ్బందిని, వాహనాలను సమకూర్చారని డీఎస్పీ మునిరామయ్య తెలిపారు. పలు భాషల్లో ముద్రించిన గోడపత్రికలు, కరపత్రాలను బస్సులకు అంటించడం ద్వారా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ప్రచారం చేశామని, సంబంధిత రాష్ట్రాల్లోని పోలీసు స్టేషన్లకు అందజేశామని వివరించారు. వీటితో పాటు వాట్సాప్, ఫేస్‌బుక్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా నిందితుల సిసిటివి ఫుటేజీలను ప్రచారం చేస్తూ ప్రతిక్షణం పర్యవేక్షించామని తెలిపారు. తమిళనాడు రాష్ట్రం నామక్కల్ జిల్లా బేలుకుర్చి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కడి పోలీసులు చంటిబిడ్డ అపహరణపై విస్తృతంగా ప్రచారం చేయడం, నిందితుల చిత్రాలు వాట్సాప్, ఫేస్‌బుక్‌లో ప్రచారం కావడంతో గ్రామస్తులు ప్రశ్నించారని, భయపడిన నిందితులు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారని వివరించారు. అక్కడి పోలీసుల సమాచారంతో చంటిబిడ్డను తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించినట్టు ఆయన తెలిపారు.
[gallery td_select_gallery_slide="slide" ids="401,402,403,404,405"]
[gallery td_select_gallery_slide="slide" ids="401,402,403,404,405"]
No comments: