ఖజానాలో కాసులు నిల్లు... సభల్లో హామీల జల్లు - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

ఖజానాలో కాసులు నిల్లు... సభల్లో హామీల జల్లు

రవికిరణాలు(బ్యూరో): ఆస్తి మూరెడు.. హామీలు బారెడు అన్నట్లు ఉంది ప్రస్తుతం మన రాష్ట్రంలో రాజకీయనాయకుల హామీల వెల్లువ. దోసెట్లో నీళ్లతో మొక్కను పెంచుతానని ఒకరంటే అవే నీళ్లతో ఉద్యానవనాన్ని సిద్ధం చెస్తానంటున్నారు మరొకరు. లక్కీ డ్రాలో బంగారం గెలుచుకోవచ్చంటే ఆశపడతారమో గానీ గ్రాము బంగారంతో 24క్యారెట్‌ కాసులపేరు తయారుచేసిస్తామంటే నమ్మగలమా....!!!

ప్రస్తుతం రాజకీయాల్లో ప్రధాన అంశం రైతు. ఆన్నదాతను బాగా ఆకర్షించగలితే అధికారం చేజిక్కించుకోవచ్చు. అందుకే అన్నదాతను ఎంత ఆశపెట్టాలో అంత పెడుతున్నారు. ఇన్నాళ్లు వరుణుడి కరుణ కోసం రైతన్న ఆశగా ఆకాశం వైపు చూసేవాడు. ఇప్పుడు హామీలు ఎప్పుడు నెరవేరుస్తారా అని ప్రభుత్వాల వైపూ చూస్తున్నారు. ఎన్నికల సమయంలో ఆశపెడుతున్న నాయకులు.. ఆ తర్వాత.. ఏదో ఒక మెలిక పెట్టి ఆశలపై నీళ్లు చల్లుతున్నారు.

దేశానికి వెన్నెముక రైతు. ఈ విషయం బడికెళ్లే పిల్లాడికి కూడా తెలుసు. కానీ ప్రస్తుత రాజకీయాలు దేశం వెన్నెముకను ఎన్నికల అస్త్రంగా మార్చుకుంటున్నాయి. రైతుకు అది చేస్తాం ఇది చేస్తాం అంటూ వరాలు జల్లు కురిపిస్తున్నాయి. సాధారణంగా ఎన్నికల సమరం ప్రారంభమయ్యాక రాజకీయ నాయకులు తమ నోటికి పనిచెబుతారు. వాన కోసం ఎదురుచూస్తున్న రైతుపై హామీల జల్లు కురిపిస్తారు. కానీ నవ్యాంధ్రలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ల గడువు ఉండగానే నాయకులు హామీలతో ఊదరగొడుతున్నారు. దీనికి తాజా ఉదాహరణ గుంటూరులో అట్టహాసంగా జరిగిన వైఎస్‌ఆర్‌సీపీ ప్లీనరీ సమావేశం.

ఒకప్పుడు రాజకీయనాయకులు ప్రభుత్వం ఏర్పడ్డాక చేసే పనులపై హామీలు ఇచ్చేవారు. ఇప్పుడు ట్రెండ్‌ మారింది. ప్రభుత్వం ఏర్పడడానికి హామీలు ఇస్తున్నారు. తీరా అధికారం చేతికొచ్చాక హామీలను అటకెక్కిచ్చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు చాలా హామీలు గుమ్మరించారు. రైతులు, డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ, ఇంటికో ఉద్యోగం, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్‌, నిరుద్యోగ బృతి.. ఇలా చాలా హామీలే ఇచ్చారు. అప్పట్లో జగన్‌ ఆ హామీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కూడా. సాధ్యం కాని హామీలతో జనాన్నిమోసం చేస్తున్నారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రైతు రుణమాఫీ చేసేస్తున్నామన్నారు. చేశారు కూడా.. కానీ అది పూర్తి స్థాయిలో కాలేదనేది ప్రతిపక్షాల వాదన. లేదు చేశామంటూ అధికార పార్టీ ప్రతివాదన. డ్వాక్రా రుణాలు కూడా మాఫీ చేశామని ప్రభుత్వం చెబుతోంది. లేదు మహిళలని మోసం చేశారంటూ వైఎస్‌ఆర్‌సీపీ గళ్లున గోళపెడుతూనే ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల కాలంలో జగన్‌ నోటి వెంట ఎక్కువ సార్లు వచ్చిన మాట.. అసాధ్యమైన హామీలతో ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చారని. మరీ గుంటూరులో జగన్‌ చేసిందేమిటి...? అసాధ్యమైన హామీలను రెట్టింపు చేసి చెప్పారుగా...!

గుంటూరులో నిర్వహించిన వైఎస్‌ఆర్‌సీపీ ప్లీనరీ సమావేశంలో జగన్‌ ఇచ్చిన హామీలను చూస్తే...చంద్రబాబు హామీలను మించిపోయాయి. మరి ఇవెలా సాధ్యమో జగనే చెప్పాలి. నవ్యాంధ్రకు రవరత్నాలాంటి తొమ్మిది హామీలంటూ జగన్‌ చెబుతుంటే వినడానికి ఆహా అనిపిస్తున్నాయి. కానీ కాస్తైనా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై అవగాహన ఉన్నవారు ఆ హామీలను వింటే టక్కున సాధ్యపడవు అనేస్తారు. అసలు ఇంతకీ ఆయన ఇచ్చిన భారీ హామీలను చూద్దాం...

* అధికారంలోకి రాగానే ఐదెకరాల్లోపు భూములున్న రైతులకు 50 వేల నగదు.
* ఏటా మే నెలలో ఎరువులు, విత్తనాల కోసం రూ.12,500 చెల్లింపు.
* రైతులకు వడ్డీ లేని, పావలా వడ్డీ రుణాలు.
* రూ.2 వేల కోట్లతో విపత్తు సహాయక నిధి.
* రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు.
* డ్వాక్రా మహిళలకు ‘ఆసరా’. రుణాల చెల్లింపు.
* వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పెన్షన్‌ 2 వేలు.
* పిల్లల చదువుల కోసం ‘అమ్మ ఒడి’ కార్యక్రమం.
* ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకు ప్రాథమిక విద్య వరకు ప్రతి నెలా రూ.500, ఆరు నుంచి పదో తరగతి వరకు రూ. 750, ఇంటర్మీడియట్‌లో నెలకు రూ.1000 చొప్పున కుటుంబానికి ఇద్దరికి చెల్లింపు.
* 25 లక్షల ఇళ్ల నిర్మాణం. మహిళల పేరిట కేటాయింపు.
* ఆరోగ్యశ్రీ లో ఆపరేషన్‌ చేయించుకొన్న వ్యక్తి బెడ్‌రెస్టు తీసుకోవాల్సి వస్తే ప్రతీ నెలా పరిహారం. కిడ్నీ వ్యాధిగ్రస్థులకు పెన్షన్‌.
* ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం కింద మొత్తం ఫీజు చెల్లింపు. ఏటా విద్యార్థికి హాస్టల్‌, భోజన ఖర్చుల నిమిత్తం 20 వేలు అదనం!
* మూడు దశల్లో మద్య నిషేధం! మొదటి దశలో దుకాణాలను తగ్గిస్తూ బెల్టుషాపులపై ఉక్కుపాదం. రెండో దశలో... మద్యం నిషేదంపై కేంద్రానికి వినతి. మూడో దశలో కోటీశ్వరులు మాత్రమే మద్యం తాగే లా ధరలు పెంపు. మద్యం తయారు చేసినా, అమ్మినా ఏడేళ్ల శిక్ష పడేలా చట్ట సవరణ.

జగన్‌ ఇచ్చిన ఈ హామీల్లో మెచ్చుకోదగ్గది మద్యపానంపై నిషేదం. నిజంగా అది చేయగలిగితే చితికిపోతున్న ఎన్నో కుటుంబాలకు  వెలుగు ఇచ్చినట్లు అవుతుంది. కానీ అంతంతమాత్రంగా ఉన్న రాష్ట్ర ఖజానాపై మద్యపాన నిషేదం మాత్రం పెద్ద ప్రభావమే చూపిస్తుంది. ఇది ఎంతవరకు సాధ్యమనేది ఎవరూ చెప్పలేదు. ఇక ఫీజు రియంబర్స్‌మెంట్‌.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒకప్పుడు ఇంజనీరింగ్‌ విద్యకు చాలా ప్రాధాన్యం ఉండేది. అర్హులైన విద్యార్థులు మాత్రమే ఇంజనీర్లుగా బయటకు వచ్చేవారు. ఈ ఫీజు రియంబర్స్‌మెంట్‌ పుణ్యమా అని కాలేజీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. లక్షల్లో ఇంజనీరింగ్‌ పట్టభద్రులు రోడ్డున పడ్డారు. పేద విద్యార్థులకు ఉన్నత చదువులు అందించాలన్న ఆశయం మంచిదే కానీ దాని అమలు సక్రమంగా లేదన్నది అందరికీ తెలిసిందే. కానీ జగన్‌ ఫీజురియంబర్స్‌మెంట్‌తో పాటు మరో 20వేలు అదనంగా ఇస్తానంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్‌. అసలు మన రాష్ట్రానికి అంత భారం మోసే శక్తి ఉందా...? 25లక్షల ఇళ్ల నిర్మాణం, పాఠశాల దశ నుంచి విద్యార్థులకు నెలనెలా స్కాలర్‌షిప్ ఇవన్నీతలకు మించిన భారాలు కావా...? పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు అపాత్రదానం చేయకూడదని. మరి అవసరానికి మించి చేస్తామంటూ ఇస్తున్న ఈ హామీలు కరెక్టేనా.

రైతుల విషయంలో చేయండి... ఎంత చేయగలరో అంత చేయండి. దేశానికి అన్నంపెట్టే రైతన్న ఆకలితో ఉండకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. విపత్తులకు నలిగిపోతూ.. హామీల ఊబిలో కూరుకుపోతున్న అన్నదాతకు అండగా ఉండండి... అంటున్నారు సామాన్య జనం. అంతేకానీ ఉచితంగా ఇచ్చి తమను సోమరిపోతులుగా చేయొద్దంటున్నారు. ప్రతి ఒక్కరు తమ కాళ్లపై తాము నిలబడేలా ఇంటికో ఉద్యోగాం కల్పించాలంటున్నారు. అంతేగాని అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు ప్రజల సొమ్మును హామీల పేరుతో పక్కదారి పట్టించవద్దని వేడుకుంటున్నారు.
ఖజానాలో కాసులు నిల్లు... సభల్లో హామీల జల్లు Reviewed by CHANDRA BABU on July 14, 2017 Rating: 5 రవికిరణాలు(బ్యూరో): ఆస్తి మూరెడు.. హామీలు బారెడు అన్నట్లు ఉంది ప్రస్తుతం మన రాష్ట్రంలో రాజకీయనాయకుల హామీల వెల్లువ. దోసెట్లో నీళ్లతో మొక్కను ...

No comments: